తమిళ దర్శకుడు ఎ. కరుణాకరన్ తెలుగులో కొన్ని హిట్, సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. అతని తొలిచిత్రమే బ్లాక్‌బస్టర్. అది కూడా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం. వెంటనే గుర్తుకొచ్చేసి ఉంటుంది కదూ.. అవును పవన్ నటించిన 'తొలిప్రేమ'తోటే కరుణాకరన్ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. ఆ సినిమాని డైరెక్ట్ చేసే ముందు అతను శంకర్, భాగ్యరాజ్ లాంటి అగ్ర దర్శకుల వద్ద పనిచేశాడు.
'తొలిప్రేమ' తర్వాత మరో 9 సినిమాలను డైరెక్ట్ చేశాడు కరుణాకరన్. వాటిలో యువకుడు, వాసు, బాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ లాంటి సినిమాలున్నాయి. 'డార్లింగ్' తర్వాత అతను రూపొందించిన ఎందుకంటే ప్రేమంట, చిన్నదాన నీకోసం, తేజ్ ఐ లవ్ యూ (2018) ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాపయ్యాయి. నాలుగేళ్ల నుంచి అతను ఖాళీగానే ఉన్నాడు.
నిజానికి 'డార్లింగ్' హిట్టవడంతో అతని డైరెక్షన్‌లో చేయడానికి రామ్‌చరణ్ అంగీకరించాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కరుణాకరన్ వినిపించిన కథ చరణ్‌కు నచ్చిందనీ, ఆ సినిమాకు 'ఎదురే లేదు' అనే టైటిల్ కూడా ఓకే అయ్యిందనీ ఇండస్ట్రీలో వినిపించింది. కానీ తర్వాత ఏమయ్యిందో తెలీదు కానీ.. వారి కాంబినేషన్‌లో ఇంతదాకా సినిమా రాలేదు. 'డార్లింగ్' తర్వాత రామ్, తమన్నా జంటగా 'ఎందుకంటే ప్రేమంట' తీశాడు కరుణాకరన్. ఆ తర్వాత అతనికి కథ వినిపించే అవకాశం చరణ్ ఇవ్వలేదని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు.